ముక్కోతి కొమ్మచ్చి - 1 #సూర్యకాంతమ్మ వీలునామ !
ముక్కోతి కొమ్మచ్చి - 1
#సూర్యకాంతమ్మ వీలునామా.
తనకంటూ కడుపున పుట్టిన పిల్లలు లేకపోయినా, అందరినీ పిల్లలుగా భావించి లేనివారికి, వున్నవారికి కూడా అన్నదానం చెయ్యగలిగిన భాగ్యశాలి, సూర్యకాంతం గారు. కలిగినవారికి పబ్లిక్కుగా పెడితే, లేనివారికి గుట్టుగా గుంభనగా ప్రేమగా పెట్టేది, చేతులారా తినిపించేది. ఒక్క తిండేనా ! బడి ఫీజులు, పుస్తకాలు, ఉపనయనాలు, పెళ్ళిళ్ళూ, పురుళ్ళూ, బారసాలలూ, ఆస్పత్రులూ, మందులూ వగైరా కూడా...
కెమెరాముందు యెంత రాకాసి అమ్మోరో, కట్ చెప్పిన తరువాత, డైనింగుహాల్లో, అంత అమ్మదనంతో ఆదరించేది. సూర్యకాంతమ్మ గారు వడ్డించే భారీ ప్రసాదాలలో, అన్నిరకాల మధురమైన వంటకాలు వుండేవి. ఆర్టిస్టులందరూ, ఇళ్లనుంచి యెంత గొప్పవంటకాలు వచ్చినా, అమ్మ ప్రసాదంగా ఆమె పెట్టేవి ఆరగించేవాళ్ళు, ఏ భేషజాలు లేకుండా.
రమణగారికి చేసిన సినిమాలలో, సూర్యకాంతం గారి బుద్ధిమంతుడులోని అమాయక ఇల్లాలి పాత్రా, అందాలరాముడిలోని ఆపేక్ష చూపించే సావాలమ్మా , గోరంతదీపంలో తిరుగుబోతు మొగుడిని ఆటపట్టించే తీరూ, ఆ ఠీవీ, అందులో సింగారం, అన్నీ ఎన్నదగినవే !
సూర్యకాంతమ్మ గారికి, కళ్ళజోళ్ళన్నా, కార్లన్నా అమితయిష్టం. ఒకసారి, రమణగారు, ' అమ్మా ! మీకు మా సినిమాలో వేషం వున్నది. ' అనగానే, నూటఏభై రకాల కళ్లజోళ్లు తెప్పించింది. ' అమ్మా ! మీకు దేవుడిచ్చిన కళ్ళే డబుల్ సూరీళ్ళు. ఈ నల్లద్దాలు పెట్టుకుంటే, అద్దాలు బద్దలై మాడి మసై పోతాయి. ' అని చెప్పి రమణగారు సున్నితంగా ఆమెను నవ్విస్తూ కళ్ళజోడు జోలికి పోకుండా చేసారు.
ఇక కార్ల విషయానికి వస్తే, ఆ రోజుల్లో ఇంగ్లాండు నుంచి వచ్చిన ' మే ఫ్లవర్ ' కార్లు మెడ్రాసు మొత్తంమీద రెండేవుండేవి. అందులో ఒకటి సూర్యకాంతమ్మ గారిది.
రమణగారిని సూర్యకాంతమ్మ గారు ' అన్నదాతా ! అన్నదాతా ! ' అని పిలిచేది. ' నేను అంతవాడిని కాదమ్మా ! ' అని ముళ్ళపూడివారు అంటే, ' ఎంతవాడివని కాదు. ఎంత పెట్టావని కాదు. పెద్దవాళ్ళనుంచి పేదవాళ్ళదాకా ఎంత ప్రేమతో గౌరవంతో పెడుతున్నావో చూస్తున్నాను కదా నాయనా ! ' అని మెచ్చుకోలుగా అనేది.
ఆర్ధికవిషయాలకొస్తే, ఆరోజుల్లోనే పెద్దపెద్దసంస్థలతో బాటు, రమణగారికి కూడా, అత్యవసర సమయాలలో ఫైనాన్సు సర్ది సాయపడేది. చేతిలోకిఎప్పుడైనా స్పేర్ చెయ్యగలిగిన డబ్బువస్తే, ఫోన్ చేసి, ' రమణయ్య గారూ ! తోటలో మామిడిపళ్ళు వచ్చాయి ' అనేది. రమణగారు తెచ్చుకుని అవసరం గడుపుకునేవారు.
రోజులు అలానే సాగుతూ వుండవు కదా ! ఉన్నట్లుండి, సూర్యకాంతమ్మగారు, ఆస్పత్రి నుంచి ముళ్ళపూడి వారికి ఫోన్ చేయించింది. ఈయన పరుగుపరుగున ఆస్పత్రికి వెళ్లి అవసరమైన డబ్బుచెల్లించి, మిగతాది ఆమెచేతికి ఇవ్వబోతుంటే, దిండుక్రింద పెట్టమన్నది.
రమణగారు, తనబాధ్యతగా, ఇప్పుడు ఇచ్చింది, ఇంకా ఇవ్వాల్సిందే లెక్క చెబుతుంటే, వారించి, అక్కడ వున్నవారిని బయటకు వెళ్ళమని చెప్పి,రమణగారితో, ' లెక్కలు చెప్పొద్దూ నాయనా ! నీదగ్గరే వుండనీ. ఆమాత్రం ఋణానుబంధం ఉంటే మంచిదేలే ! నువ్వు పరాకు చేసినా నేను వసూలు చేసుకోగలనులే ! ' అని అదోలా నవ్వింది. అందులో వైరాగ్యం ధ్వనించింది రమణగారికి.
ఇది జరిగిన నాలుగురోజుల తరువాత, సూర్యకాంతమ్మ గారు ( అ ) కాలధర్మం చెందారు.
తరువాత కొన్నాళ్ళకు సూర్యకాంతమ్మ గారి వకీలు కబురుచేస్తే,రమణగారు వెళ్లారు. ఆయన ఒక స్టాంపుపేపర్ వున్న దస్తావేజు చేతిలోపెట్టారు. ' నాకూ, ఆమెకూ, ఏ రాతకోతలూ, లావాదేవీలూ లేవే, ఏమిటి ఈ దస్తావేజు ? ' అని రమణగారు నివ్వెరబోయారు.
అది సూర్యకాంతమ్మగారి వీలునామా ! ఆమె పోవడానికి సంవత్సరం ముందే, సుబ్బరంగా, ఆరోగ్యంగా వున్నప్పుడే ఆమె రాయించింది. అందులో, ఆమె దత్తపుత్రుడు, ఒకమిత్రుడితో బాటు, మొత్తం ముగ్గరు వారసులను తన ఆస్తికి ట్రస్టీలుగా నియమించింది. అందులో మూడోవాడు చి. ముళ్ళపూడి వెంకటరమణ !
ఆమె ఎప్పుడూకూడా, ' నాకు కన్నవాళ్ళు లేరుగానీ, ఉన్నవాళ్ళంతా నాకన్నవాళ్ళే అనేది ' అదే నిజం చేసింది.
తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆ సూర్యకాంతి ఎప్పుడూ, ఆరని కాకారపువ్వొత్తిలా, ముత్యాల మతాబుల వెలుగులు వెదజల్లుతూనే ఉంటుంది.
Comments
Post a Comment