త్యాగరాజస్వామివారు కృతులతో, రామాయణం.🔻

#త్యాగరాజస్వామివారు కూడా తన కృతులతో,రామాయణం వ్రాశారు.

వ్రాసే ముందు రాముడికే ఇలా విన్నవించుకున్నారు...

'వాల్మీకాది మునులు,నరులు నిను వర్ణించిరి, నా ఆశతీరునా? ఏపనికో జన్మించితినని నన్నెంచవలదు..'(అసావేరి)అంటూ రచన ప్రారంభించారు.

#శ్రీరామ జననాన్ని వర్ణిస్తూ..'అవనికి రమ్మని పిలిచిన మహరాజు ఎవరో వానికి మ్రొక్కెద!'(దేవమనోహరి)అన్నారు.

#యాగరక్షణకై పయనమైన రాముని కీర్తిస్తూ...'పుడమిలో జనులెల్ల పొగడ,పూజితుడై మునితో గూడి, వెడలెను కోదండపాణి,అనుజ సౌమిత్రినిగూడి..'(తోడి)అని పాడుకున్నారు.

#విశ్వామిత్రునివద్ద రామలక్ష్మణులు అస్త్రవిద్యల నేర్చిన సందర్భాన్ని వివరిస్తూ..'శ్రీకాంత!నీయెడ బలాతిబల చెలగంగలేదా! నీవు అరి బలాబలములు తెలియగలేదా!(భవప్రియ)అని,పేర్కొన్నారు.

#రాముని యాగరక్షణ దీక్షను శ్లాఘిస్తూ..'పసితనమందే, మునియాగమున, ఘన డంభుని తోడను, మారీచుని పనిచెరచిన నీ బాహుపరాక్రమము నెరుగనా? రాకా శశివదనా!'(చంద్రజ్యోతి)అని కీర్తించారు.

#అహల్య శాపవిమోచనం చేసిన రామపాదానికి మొక్కుతూ..'శూర అహల్యను చూచి, బ్రోచి తారీతి ధన్యుసేయవే!శ్రీరామ పాదమా! నీకృప చాలునే!'(అమృతవాహిని) అని వేడుకున్నారు.

#శివధనుర్భంగ సన్నివేశంలో..'ముని కనుసైగ తెలిసి, శివధనువును విరిచే సమయమున త్యాగరాజ నుతుని మోమున రంజిల్లు అలకలల్లలాడగ గని, ఆ రాణ్ముని ఎటుపొంగెనో?'(మధ్యమావతి) అని తాను దర్శించినట్లు వర్ణించారు.

#ఇక,సీతారామ కళ్యాణాన్ని నయనమనోహరంగా..'సీతాకళ్యాణ వైభోగమే!

రామకళ్యాణ వైభోగమే!'(కురంజి) అంటూ కళ్లకుకట్టారు.

#పరశురామ గర్వభంగం చేసిన రాముని..'భ్రుగుసూను మదవిదారా! రఘువీర! రణధీర! రారా! రాజకుమార!'(హుసేని) అంటూ పిలిచారు.

#కైకేయి శాప వృత్తాంతాన్ని తలచుకొని,'రామచంద్ర!నీదయ!రామ!ఏల రాదయా?' అంటూ..'కాననంపు తాపమో? కైకమీది కోపమో! నేనుచేయు పాపమో? నీకు శక్తి లోపమో?'(సురటి)అంటూ శ్రీరాముని దెప్పి పొడిచారు.

#రామ పట్టాభిషేక భంగాన్ని జీర్ణించుకోలేక,'మనసా!మనసామర్థ్యమేమి?'(వర్ధని) అంటూ వాపోయారు.

#రాముడు వనవాసానికి బయలుదేరగానే..సీతమ్మ,

'నన్ను విడచి కదలకురా! నిన్నుబాసి అరనిముసమోర్వనురా!'(రీతిగౌళ)అని వేడుకొని, తాను కూడా భర్తను అనుసరించినట్లు భావించారు.

#ఆతిథ్యమిచ్చిన గుహుని తలచుకొని,'ధరాతలమున గుహుని వలె పత్రతల్ప మొనర్చితినా? పరాకు నీకేలరా?'(కిరణావళి)అంటూ ప్రశ్నించారు.

#భరతునికి పాదుకలిచ్చిన సందర్భంలో,త్యాగయ్యగారికి సందేహం కల్గింది..'నందార్చిత పదయుగంబు మేలో? నాగరికంబగు పాదుకాయుగంబు మేలో?'(రామప్రియ)..అని.

#కాకాసురవృత్తాంతాన్ని వర్ణిస్తూ..'కాకాసురుడు చేయు చీకాకు సైరించుకోక,మదిని దయ బాసి,బాణమువేసి,ఏకాక్షుని చేయు సాకేతపతిని'(వకుళాభరణం) స్థుతి చేశారు.

#శూర్పణఖ శ్రీరాముని వివాహం చేసుకోమన్నప్పుడు,'ఒక మాట,ఒక బాణము,ఒక పత్నీవ్రతుడే మనసా!'(హరికాంభోజి)..

#'కదలేవాడు కాడే రాముడు..'(నారాయణగౌళ)అంటూ రాముని సుగుణాలను తలచుకొని, పొంగిపోయారు.

#శబరి భాగ్యాన్ని తలచుకొంటూ..'కనులార సేవించి,కమ్మని ఫలములనొసగి,ఇనకులపతి సముఖంబున,పునరావృత్తి రహిత పదమును పొందిన శబరి భాగ్యమును ఎంతని నే వర్ణింతును?'(ముఖారి)అని,కొనియాడారు.

#సుగ్రీవుడు పంపగా వచ్చిన హనుమతో తాను మాటలాడక,తమ్మునితో బల్కచేసిన రాముని రాజసాన్ని,చనవుతో..'ఆడమోడిగలదే రామయ్య!'(చారుకేశి) అంటూ ప్రశ్నించారు.

#వాలి,సుగ్రీవుల సంగ్రామంలో..'వాలినొక్క కోలనేసి,రవిబాలుని రాజుగ గావించి,జూచి, బ్రోచేవారెవరే?'(శ్రీరంజని) అని పొగడారు.

#సముద్రుని గర్వమణచిన శ్రీరాముని..'శరశరసమరైక శూర!శరధి మదవిదార!'(కుంతలవరాళి) అంటూ కీర్తించారు.

#విభీషణ శరణాగతిని తలచుకుంటూ..'పగవానికి సోదరుడని ఎంచక,భక్తినెరిగి,లంకాపట్టమొసగగ,ఎవ్వరే రామయ్య!నీసరి?'(గాంగేయభూషిణి)అని కీర్తించారు.

#రామ,రావణ యుద్ధ సమయంలో,రామబాణానికి ఉన్న శక్తికి ముగ్ధులై,'రామబాణ త్రాణ,శౌర్యమేమని తెలుపుదురా! ఓమనసా!'(సావేరి)అని వర్ణించారు.

#రామతత్వమెరిగిన శివుని భక్తుడినని చెప్పుకునే రావణుడు,రాముడెంతటి చతురుడో తెలుసుకోలేకపోయాడని,చివరికి రాముడి చేతిలో హతుడయ్యాడని..'సరస సామదానభేదదండ చతుర! సాటి దైవమెవరే!'(కాపీనారాయణి) కృతిలో వివరించారు.

#సీతాదేవిని అగ్నిపరీక్షకు నిలబెట్టిన రాముణ్ణి తప్పుపట్టారు త్యాగయ్యగారు.అసలు 'మాజానకి చెట్టబట్టగా మహరాజువైతివి '(కాంభోజి) అంటూ రాముణ్ణి ఆడిపోసుకున్నారు.

#ఎట్టకేలకు అయోధ్యకు తిరిగివచ్చి,పట్టాభిషిక్తుడై,కొలువైన కోదండపాణిని వర్ణిస్తూ..'జనకజ, భరతాదులతో మంచి నైవేద్యంబులు చనవున వేడుకనారగించి,వేదోక్తమైన సనక వచనములచే తోషించి,శ్రితుల పోషించి, కొలువైయున్నాడే కోదండపాణి'(దేవగాంధారి) అంటూ కీర్తించారు.

#త్యాగరాజ రామాయణం సంపన్నమైంది. చివరికి.. ఫలశ్రుతి చేస్తూ..

'ధర్మాద్యఖిల ఫలదమే మనసా!

ధైర్యానంద సౌఖ్య నికేతనమే!

కర్మబంధ జ్వలనాబ్ధిపోతమే!

కలిహరమే! త్యాగరాజ వినుతుడగు

రామకథా సుధారసపాన మొక

రాజ్యము సేయునే మనసా!'(మధ్యమావతి)అంటూ..

రామాయణ పారాయణం వల్ల ఒనగూడే ప్రయోజనాలను వివరించి, తాము చరితార్థులై, మనలను తరింపచేశారు త్యాగయ్యగారు.

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩