🚩🚩అజామిళోపాఖ్యానం:🚩🚩

 

✍🏿ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడే ఒక నగరం వుండేది. ఆ నగరంలో ఒక శ్రోత్రియుడయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనమును ఆచరించి వేదవేదాంగములను తాను పఠించి పదిమందికి వేదమును వివరణ చేస్తూ పదిమందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితమును గడపగలిగిన సమర్థుడు అయినవాడు. యాదృచ్ఛికముగా ఆయనకు ఐశ్వర్యము సమకూరింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల యందు భగవంతుని యందు రమించే స్థితిని కలిగి వున్నవాడు. అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు #అజామీళుడు. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరం ఆయనకు ఒక ఉత్తమమయిన సౌందర్యవతియైన కన్యను తెచ్చి వివాహం చేశారు. ఆయన శీలం ఎటువంటిది? పుట్టినపుడు గతంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులమున జన్మించాడు. సత్కర్మ అంటే చేసిన పని. యజ్ఞోపవీతం వుంది, సంధ్యావందనం చేసి గాయత్రీమంత్రం జపించేవాడు. ఈవిధంగా అతడు జ్ఞానమును పొందినవాడు. శాంత లక్షణమును కలిగి ఉన్నాడు
అజామీళుడు సత్యభాషణా నియమమును పెట్టుకున్నాడు. ధర్మమును వదలలేదు. నిత్య నైమిత్తిక కర్మలను వదిలి పెట్టలేదు. ఈవిధంగా అజామీళుడు రాశీభూతమయిన బ్రాహ్మణ తేజస్సు.
#ఇప్పుడు అజామీళుడికి యౌవనం అంకురించింది. మానవుడు అయిదు ఇంద్రియములతో భోగములను అనుభవించవచ్చు. ఈశ్వరుడిని చేరుకోవచ్చు.. ఆయనను తండ్రిగారు ఒకరోజు పిలిచి రేపటి పూజకు దళములు, దర్భలు పువ్వులు తీసుకు రావలసినది అని చెప్పారు. తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళి పువ్వులు, సమిధలు కోసి సంతోషంగా ఇంటివైపుకి వచ్చేస్తున్నాడు. అంతలో అతనికి ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది. దానిని ముందు చెవి గ్రహించింది. అది వినవలసిన ధ్వని కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉంటే వేరు. ఈ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది. పొదవైపు చూశాడు. కల్లుకుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమయిన జన్మను పొందిన ఒక స్త్రీ, ఆ కల్లును తాను విశేషముగా సేవించి శారీరకమయిన తుచ్ఛమయిన కామమునందు విశేషమయిన ప్రవేశము అనురక్త అయిన ఒక స్త్రీ కళ్ళు సేవించిన పురుషుడు శృంగార క్రీడయందు విశేషమయిన #అభినివేశము ఉన్న వాడితో ఆనందముగా పునః పునః రతిక్రీడ జరుపుతున్నది.
అజామీళుడు ఆ సన్నివేశము చూశాడు. కానీ ఇక్కడ అజామీళుడి మనస్సును ఆ దృశ్యము ఆక్రమించింది. కర్మేంద్రియ సంఘాతము ఆయనను నిలబెట్టేసింది. చూస్తున్న సన్నివేశం మనస్సులో ముద్రపడడం ప్రారంభం అయిపొయింది. అలా నిలబడి తమకముతో ఆ సన్నివేశమును వీక్షించాడు.
#అనగా ఇన్నాళ్ళు వశములో ఉన్న ఇంద్రియ లౌల్యము గలవడం ప్రారంభం అయింది. వారిద్దరూ వెళ్ళిపోయిన తరువాత తానూ వెళ్ళిపోయాడు. 
ఇంటికి వెళ్ళి దర్భలు తండ్రికి ఇచ్చి అసుర సంధ్య వేళా సంధ్యావందనమునకు కూర్చున్నాడు. కానీ మనస్సులో కనపడుతున్నది ప్రార్థనా శ్లోకము కాదు. పొదలమాటున తన కన్ను దేనిమీద నిలబడిందో అది కనపడుతోంది. ఇంట ధర్మపత్నియై సుగుణాల రాశియై సౌందర్యవతియైన భార్య ఉన్నది. కానీ ఆయన కోర్కె వేరొక కులటయందు ప్రవేశించింది. ఆచార్య వాక్కులు గుర్తు తెచ్చుకుని అధిగమించాలని ప్రయత్నం చేశాడు. కానీ అతడు చూసిన సన్నివేశము వీటన్నింటిని తొలగదోసినది. #ఒకనాటి రాత్రి తన భార్యకు తల్లికి, తండ్రికి తెలియకుండా ఆహీనకుల సంజాత అయిన ఆస్త్రీని చేరాడు. సంధ్యావందన భ్రష్టుడై రాత్రింబవళ్ళు అక్కడే ఉన్నాడు. తల్లిదండ్రులను ఎదిరించాడు. భార్యను విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. వారి ధనమును దోచుకున్నాడు. కులట స్త్రీయందు 9మంది బిడ్డలను కన్నాడు.
#అతడు చేసిన ఒకే ఒక మంచి పని – ఆవిడ కడుపున పుట్టిన ఆఖరు బిడ్డడికి #‘నారాయణ’ అని పేరు పెట్టడం. ఆఖరి పిల్లాడు అవడం మూలాన వాడిమీద మమకారం ఉండిపోయి వాడిని నారాయణ నారాయణ అంటూ తరచూ పిలుస్తూ ఉండేవాడు. ఆవిడ పిల్లల పోషణార్థమై డబ్బు సంపాదించుకు రామ్మనేది. అందుకుగాను దొంగతనములు చేయడం మొదలు పెట్టాడు. ఎంత వేదం చదువుకున్నాడో, ఎవడు నిత్య నైమిత్తికములను నెరపినాడో, ఎవడు శాంతుడై దాంతుడై సకల వేదములను చదివాడో ఎవడు మంత్రసిద్ధులను పొందాడో అటువంటి అజామీళుడు ఈవేళ ఆరితేరిన దొంగయై అంతటి దొంగ లేదని అనిపించుకున్నాడు.
#ఇంత పతనం ఎక్కడినుంచి వచ్చింది? ఒక్క ఇంద్రియ లౌల్యం వల్ల వచ్చింది. మనిషి మనిషిగా బ్రతకడం, ఈశ్వరుని చేరుకోవడం ఇంద్రియములను గెలవడం ఎంతకష్టమో చూడండి . . .
✍️కాలము ఎవ్వరి గురించి ఆగదు. ఎప్పుడో ఒకరోజు మహా మరణ కాలము వస్తుంది. ఆ మృత్యువు కభళించక ముందే ఈశ్వరనామం చెప్పుకోవాలి.యమదూతలు వచ్చి అజామిళుడి ఎదురుగా నిలబడ్డారు. వాళ్ళను చూసేసరికి ఈయనకు విపరీతమైన భయం వేసింది. అంత భయంలో ఏం చేయాలో అర్థం కాక అప్రయత్నంగా #నారాయణా! అని తన కొడుకును తలచుకుంటూ గొణిగాడు. అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది. ఇంతవరకు ఎంత భయమును పొందాడో ఆ భయమును మాయం చేయగలిగిన విచిత్ర విషయమును చూశాడు.
నలుగురు దివ్య తేజోవంతులయిన #మహాపురుషులు వచ్చి యమధర్మరాజు భటులతో ఆ పాశములను తీసివేయమని చెప్పారు. అపుడు యమధర్మరాజు భటులు "మీరు ఎవరు?" అని ప్రశ్నించారు. "మేము ఎవరిమో చెప్తాము. ముందు ఆ పాశములను తీసివెయ్యండి" అన్నారు. అపుడు యమదూతలు తమ పాశములను విడిపించారు. అజామిళుడికి పూర్వపు ఓపిక వచ్చింది. వాళ్ళ మాటలు బయట వాళ్ళకు వినబడడం లేదు. కానీ #అజామిళుడు మాత్రం వాళ్ళ మాటలను వింటున్నాడు. ఆవచ్చిన వాళ్ళు ఎవరా? అని అజామిళుడు విష్ణుదూతల వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. యమదూతలు "అయ్యా వీడెవడో తెలుసా! పరమ దుర్మార్గుడు. ఇటువంటి వాడిని మేము ఎందుకు విడిచిపెట్టాలి? మీరు వీడిని ఎందుకు వదలమంటున్నారు? మీరు ఎందుకు వచ్చారు? అసలు మీరు ఎవరు? అని అడిగాడు.
అపుడు విష్ణు దూతలు "మమ్ములను విష్ణు పార్షదులు అంటారు. మేము శ్రీవైకుంఠము నుండి వచ్చాము. అజామిళుడిని విడిపించమని స్వామివారు ఆజ్ఞాపించారు. అందుకని వచ్చాము" అన్నారు.
అపుడు #యమభటులు "ఇది ధర్మమా? ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతాము?" అని అడిగారు. అపుడు విష్ణుదూతలు " ఇది ధర్మమో అధర్మమో ధర్మమే తన పేరుగా గలిగిన యమధర్మరాజు గారిని అడగండి. మీరు యితడు ఈ జన్మలో చేసిన పాపముల గురించి మాట్లాడుతున్నారు. మేము ఇతని కోటిజన్మల పాపముల గురించి మాట్లాడుతున్నాము. అంత్యమునందు శరీరమునందు ప్రాణోత్క్రమణం జరుగుతున్న సమయంలో యితడు ఈశ్వరుని నామమును పలికాడు. అది అమృత భాండము. శ్రీహరి నామమును పలికిన కారణం చేత కోటిజన్మల పాపరాశి ధ్వంసము అయిపొయింది. కాబట్టి ఈతనిని మీరు తీసుకుని వెళ్ళడానికి అర్హత లేదు" అన్నారు. అపుడు యమదూతలు "అయితే వీడు చేసిన పాపములు అన్నీ ఏమయ్యాయి?" అని అడిగారు. అపుడు విష్ణుదూతలు నీవు మాతో రావచ్చు అని అజామిళుడిని వైకుంఠమునకు తీసుకు వెళ్ళిపోయారు. ఆయన #శ్రీమన్నారాయణునిలో ఐక్యం అయిపోయాడు. 
ఈ# అజామిళోపాఖ్యానం ఎవరు చదివారో వారు విశ్వాసముతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తే వాళ్లకి ఈ జన్మలో యమదూతలతో సంవాదము లేదు అని వ్యాసమహర్షి అభయం ఇచ్చారు. అదీ దాని ఫలశ్రుతి!

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩