🚩🚩 కళావాచస్పతి కొంగర జగయ్య .🚩🚩
🚩🚩 కళావాచస్పతి కొంగర జగయ్య .🚩🚩
👉🏿ఊపిరున్నంతవరకూ నటించాలా?
ఏం! ఊపిరున్నంతవరకూ నటించాలా? నటించడం మానేస్తే ఊపిరాగిపోతుందా?
ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్తూ జగ్గయ్య .
సినీ పరిశ్రమలో జగ్గయ్యకో ప్రత్యేకత వుంది. ఆయన కళావాచస్పతి. రవీంద్రుడిని చదివారు. వాస్తు జ్యోతిష్యం తెలుసు.
కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1928 - మార్చి 5, 2004) ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచాడు.
విద్యార్థిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రేసు పార్టీలో చేరి భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. పాఠశాల చదువు సాగుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపుకు తెనాలిలో సెక్రటరీగా పనిచేసాడు.
ఉన్నత చదువులకు గుంటూరు లోని ఆంధ్రా క్రిస్టియను కళాశాలలో చేరాడు.
ఇక్కడే నందమూరి తారక రామారావుతో పరిచయం ఏర్పడినది. ఈ కాలేజీలో ఎన్.టి.రామారావు, కొంగర జగ్గయ్య ఇద్దరు సహ విద్యార్థులు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు;
జగ్గయ్య మూడు సంవత్సరాలపాటు వరుసగా ఉత్తమ నటుడు పురస్కారం పొందాడు. ప్రముఖ చిత్రకారుడు అడవి బాపిరాజు వద్ద చిత్రలేఖనంలో శిక్షణ పొందాడు. విజయవాడలో అరుణోదయ, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థల తరపున నాటకాలు వేశాడు. డిగ్రీ పూర్తవగానే తెనాలి దగ్గర ఉన్న దుగ్గిరాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగమొచ్చింది. అప్పుడు కూడా పాఠశాలలో పనవగానే రైల్లో బెజవాడకు వెళ్ళి రిహార్సల్స్ చేయడం, నాటకాలు వేయడం చేస్తుండేవాడు.
ఎన్.టి.రామారావుతో కలిసి విజయవాడలో రవి ఆర్ట్ థియేటర్ స్థాపించి ఎన్నో నాటకాలు వేసి పరిషత్తు పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. బుచ్చిబాబు వ్రాసిన దారిన పోయే దానయ్య నాటిక వీరికి బాగా పేరు తెచ్చి పెట్టింది.
ఆ తర్వాత ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో మూడు సంవత్సరాలపాటు వార్తలు చదివే ఉద్యోగం చేసారు. అక్కడ కూడా తెలుగువాళ్ళను పోగేసి నాటకాలు వేశారు.
దుగ్గిరాల ఉన్నత పాఠశాలలో పని చేసే టప్పుడే ఢిల్లీ రాజ్య పతనం అనే నాటకంలో జమునతో వేషం వేయించారు జగ్గయ్య గారు.
త్రిపురనేని గోపిచంద్ తీసిన ప్రియురాలు సినిమాతో జగ్గయ్య సినిమాలలో అరంగేట్రం చేసాడు. అయితే ఈ సినిమాగానీ, దీని తదుపరి చిత్రాలు కాని పెద్దగా విజయం సాధించలేదు.
సినిమాల కోసం మొదట రేడియో ఉద్యోగానికి ఒక సంవత్సరం సెలవు పెట్టాడు. తర్వాత సినిమా రంగంలోనే కొనసాగాలని నిశ్చయించుకుని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు.
అర్ధాంగి మరియు బంగారు పాప చలన చిత్రాల విజయంతో మళ్ళీ వెలుగులోకి వచ్చాడు. 1950ల నుండి 1970ల వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేసాడు. మరణించేవరకు కూడా అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూనే ఉండేవాడు. కొన్ని చలన చిత్రాలలో కథానాయకునిగా, ఎక్కువ చిత్రాలలో సహాయనటునిగా, హాస్య పాత్రలలో మరియు ప్రతినాయకుని పాత్రలలో నటించాడు. "కళాకారుడు తనలోని కళాదాహాన్ని తీర్చుకోవడానికి రోటీన్ హీరో పాత్రలు సరిపోవు." అని నమ్మిన వాడు కాబట్టే ఆయన విభిన్నమైన పాత్రల మీద ఆసక్తి చూపించాడు.
అలా కొన్నిసార్లు తనకు హీరో పాత్ర ఇవ్వచూపిన వాళ్లను కూడా అదే కథలోని కొంచెం క్లిష్టమైన లేదా వైవిధ్యమైన పాత్ర ఇవ్వమని అడిగేవాడు!
అప్పట్లో సాంఘిక చిత్రాల్లోని ప్రతినాయక పాత్రలు కూడా పౌరాణిక ప్రతినాయక పాత్రల్లానే ఉండేవి. ఆ పద్ధతి మార్చాలని జగ్గయ్య ప్రతినాయక పాత్రలను ఎంచుకున్నాడు. కథానాయకుడు అందంగా ఉంటే ప్రతినాయకుడు కూడా అందంగానే ఉంటాడు. మన మధ్య తిరిగే మామూలు మనిషిలానే ఉంటాడు. అలా చూపించాలనే ఆయన ప్రతినాయక పాత్రలు చేశాడు. ప్రతినాయకుడు అంటే, వికారంగా, కౄరంగా ఉండాలనే అభిప్రాయం పోగొట్టాడు.
"విలన్ కూడా లవబుల్ గానే ఉండాలి. అప్పుడే అతను మరిన్ని మోసాలు చేయగలడు. అలాంటి పాత్రల్లో అభినయ సునిశితత్వాన్నిప్రదర్శించడానికి మంచి అవకాశముంటుంది." అనేది ఆయన అభిప్రాయం. ఆయన దాదాపు 500 చిత్ర్రాల్లో నటించాడు.
ఆయన నటించిన ఏకైక తమిళ చిత్రం శివగామి.
2004, మార్చి 5 న 76 సంవత్సరాల వయసులో చెన్నైలో గుండెపోటుతో జగ్గయ్య మరణించాడు.
🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻
Comments
Post a Comment