మహర్షులు ప్రసాదించిన అమృతం!
మహర్షులు ప్రసాదించిన అమృతం!
.
జాతస్య మరణం ధృవం...పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు.
కానీ అకాలమరణాన్ని ఎలా జయించాలి? సత్యవ్రతాన్ని పాటిస్తూ, సద్వర్తనతో మెలగుతూ, ధర్మపరాయణులుగా ఉండడమే దీన్ని దాటే సులభమార్గం. ఈ విషయాన్నే ధృవీకరిస్తూ మనం చేయాల్సిన నిత్యకృత్యాలు మహాభారతంలోని అరణ్యపర్వంలో వివరంగా చెప్పారు.
పూర్వం హైహయవంశంలో దుంధుమారుడు అనే రాకుమారుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేటకు వెళ్లిన సందర్భంలో జింక చర్మాన్ని ధరించి ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడిని జింకగా భ్రమించి బాణంతో కొట్టాడు. ఆ వేటుకు యువకుడు మరణించాడు. దుంధుమారుడు ఆ బ్రాహ్మణయువకుడి మృత కళేబరాన్ని చూశాడు. పొరపాటుకు ఎంతో విచారించాడు. ఈ విషయాన్ని తన కుల పెద్దలకు తెలిపాడు. వారందరూ సమీపంలో ఉన్న తార్క్షు్యడు అనే ముని ఆశ్రమానికి వెళ్లి జరిగిన విషయం చెప్పారు.
ఆ బ్రాహ్మణయువకుని హతమార్చిన మహాపాపాన్ని తొలగించుకునే మార్గం చూపుమని ప్రార్థించారు. అప్పుడు తార్క్షు్యడు వారితో "ఆశ్రమంలో నివసించే వారికి భయం, రోగం, చావుల వంటివి వుండవు" అంటూ, మరణించిన బ్రాహ్మణ యువకుడిని సజీవంగా వారికి చూపాడు. ఈ మహిమకు కారణమేమిటని వారు ప్రశ్నించారు మునిపుంగవుడిని.
అందుకు తార్క్షు్యడు...
ఆలస్యం బొక యింత లేదు
శుచి ఆహారంబు
నిత్యక్రియాజాలం బేమరము
అర్చనీయు లతిథుల్
సత్యంబ పల్కంబడున్
మేలై శాంతియు, బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తుము
అట్లౌట నెక్కాలంబుం బటురోగమృత్యు భయశంకం బొంద మేమెన్నడున్
- అని చెప్పాడు.
ఆశ్రమజీవితంలో మృత్యుంజయసిద్ధికి అనుష్ఠించబడే నియమాలు...
కాలం విలువ గుర్తించడం, ఆహారం పరిశుభ్రంగా ఉంచడం, ప్రతిదినం జరపాల్సిన పనులు ఏమాత్రం మరువకపోవడం, అతిథులను పూజించడం, సదా సత్యవ్రతాన్ని పాటించడం, శాంతి, ఇంద్రియ నిగ్రహంతో కూడిన నిష్కామవ్రతాచరణ చేయడం.
ఈ విధమైన ధర్మాచరణ వల్ల మనం రోగమృత్యు భయాందోళనలు లేక నిశ్చింతగా జీవించవచ్చనేది మహర్షుల బోధనాసారం.
ఫలశ్రుతి:
ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తియు
అర్థార్థులకు విపులార్థములును
ధర్మార్థులకు నిత్యధర్మసంప్రాప్తియు
వినయార్థులకు మహావినయ
మతియు పుత్రార్థులకు బహుపుత్రసమృద్ధియు
సంపదర్థుల కిష్టసంపదలును
గావించు నెప్పుడు భావించి
వినుచుండువారికి నిమ్మహాభారతంబు
భావం: మహాభారతం ఎల్లప్పుడు తలచి వినే జనులకు ఆయుర్దాయాన్ని కోరేవారికి దీర్ఘాయుస్సును, ధనాన్ని కోరేవారికి అధికమైన ధనలాభాన్ని, ధర్మాన్ని కోరేవారికి సంతతధర్మలాభాన్ని, వినయాన్ని కోరేవారికి గొప్ప వినయంతో కూడిన బుద్ధిని, పుత్రసంతానాన్ని కోరేవారికి పుత్రసంతానాన్ని, ఐశ్వర్యం కోరేవారికి అభీష్టసంపదలను కలుగజేస్తుంది. ఇందులో చెప్పిన విషయాలు సుస్పష్టం. ఆయుస్సు, ధనం, సంతతి, ఐశ్వర్యం అందరూ కోరేవే. మరి ధర్మం - వినయాల ప్రాధాన్యం ఏమిటి?
విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం |
పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం, తతస్సుఖం ||
ధనానికి ముందువెనుక ఉత్తమలక్షణాల నుంచారు మనవాళ్లు, అవే వినయం, ధర్మం. వినయం వల్ల ధనం సంపాదించే అర్హత లభిస్తుంది. ధర్మసమృద్ధికి కారణమయ్యే ధనం వల్ల సుఖశాంతులు లభిస్తాయి. భగవంతుని వద్దకు వెళ్లిన భక్తుడు వినమ్రుడై చేతులు జోడించి నిశ్చలభక్తితో నమస్కరించి కోర్కెల చిట్టా విప్పకూడదు. ధర్మసమృద్ధికి కారణమయ్యే ధనాన్ని, ఆ ధనాన్ని సద్వినియోగం చేసే సద్బుద్ధిని ఇమ్మని ప్రార్థించాలి అని శ్రీ వేంకటేశ్వర కరావలంబస్తోత్రం చెబుతోంది. సుఖశాంతులు లేనప్పుడు ఆయుష్షు, ధనం, సంతతి, ఐశ్వర్యం, అన్నీ వ్యర్థాలే.
******
Comments
Post a Comment