❤️🌹🙏🏿ఋణానందలహరి.🙏🏿🌹❤️
❤️🌹🙏🏿ఋణానందలహరి.🙏🏿🌹❤️
#ఋణానందలహరి ముళ్లపూడి వెంకటరమణ రాసిన కథలమాలిక. ఋణము అనగా అప్పు. అప్పులు తీసుకోవడం, అప్పులవాళ్ల నుంచి తప్పించుకోవడం, అప్పుల ప్రశస్తి వంటి హాస్యస్ఫోరకమైన అంశాల ఆధారంగా రాసిన కథలమాలిక.
ఇతివృత్తం.!
పంచతంత్ర కథల్లో మనుషుల కోసం జంతువుల కథల ద్వారా నీతి చెప్తే రమణ ఋణానందలహరిలో జంతువులు ఓ వ్యవహారం తేల్చుకునేందుకు మనుషుల కథల ద్వారా నీతి చెప్తారు. సుబ్బన్న, నాగలక్ష్మి అనే పాములు తమ పుట్టకు తిరిగివచ్చేసరికి పుట్టను చీమలు ఆక్రమించడంతో నిర్ఘాంతపోతారు. ఆ పుట్ట తమదేనని గొడవ మొదలుపెట్టే పాములను గత జన్మలలోని ఋణానుబంధాలను చెప్పి ఆ వాదన పూర్వపక్షం చేయబోవడం ప్రధాన ఇతివృత్తం.
ఆ ప్రయత్నంలో భాగంగా పాముల పూర్వజన్మ ఋణానుబంధాల కథలు, ఆ కథలకు సమాధానంగా పాము సుబ్బన్న చెప్పే మానవుల ఋణగాథలతో కథలు ముందుకు సాగుతాయి.
#అప్పారావు పాత్రచిత్రణ.!
తెలుగు సాహిత్యంలో ముళ్లపూడి వెంకటరమణ సృష్టించిన అప్పారావు పాత్ర బహుళ ప్రచారం పొంది, చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రగా అభివర్ణించారు విమర్శకులు.ఎంతటి గట్టివాడి నుంచైనా చులాగ్గా అప్పు పుచ్చుకుని కనుమూసి తెరిచేలోగా మాయమయ్యే పాత్రగా ముళ్లపూడి వెంకటరమణ ఇతర కథలెన్నిటిలోనో కనిపిస్తుంది అప్పారావు పాత్ర. ఆ పాత్రనే ఋణానందలహరి కథామాలికకు కథానాయకునిగా తీసుకున్నారు. అప్పారావు పాత్ర వర్ణన
అప్పారావు కొత్తరూపాయి నోటులా ఫెళ ఫెళ లాడుతూ ఉంటాడు. కాలదోషం పట్టిన దస్తావేజులాంటి మాసినగుడ్డలూ, బడిపంతులుగారి చేబదుళ్లులా చిందరవందరగా ఉండే జుట్టూ, అప్పు తెచ్చిన విచ్చు రూపాయిలా మెరిసే పత్తికాయల్లాంటి కళ్ళూ, అప్పులివ్వగల వాల్లందరినీ చేపల్లా ఆకర్షించగల యెరలాంటి చురుకైన చూపులూ! అతను, బాకీల వాళ్లకి కోపిష్ఠివాడి జవాబులా పొట్టిగా టూకీగా వుంటాడు. అంటూ సాగుతుంది.
#విచిత్రమైన టెక్నిక్కులతో అప్పారావు అప్పులు సంపాదిస్తూంటాడు. ఉదాహరణకు తన చొక్కాలను హాస్టల్ రూముల్లో వదిలేస్తూంటాడు. అవి పొరబాటున వేసుకుని బయటకెళ్లిన మిత్రులు అప్పులో, చేబదుళ్ళో జేబులో వేసుకొస్తె ఉన్న ఫళంగా ఇది నాథని చెప్పి విప్పి వేసుకుపోయి జేబులో డబ్బు జేబదలుగా పుచ్చుకుంటాడు. అతను ఎప్పుడు ఎవర్ని ఎంత అప్పడుగుతాడో ఎవరూ చెప్పలేరు, చివరికి అప్పారావు కూడా. స్నేహితుడు గుర్నాధం మాటల్లో చెప్పాలంటే ఆ ఋణలీల మనకి అర్థం కాదు.
రమణ ఆప్తమిత్రుడు, చిత్రకారుడు బాపు కూడా ఆ పాత్రకు రమణ రాసిన వర్ణన, వ్యక్తిత్వం వ్యక్తమయ్యేలా రేఖారూపమిచ్చారు.
#పాత్రలకు పేర్లు పెట్టడంలో కూడా నేర్పు చూపించాడు రచయిత. చీమల పేర్లు చీమంతుడు, చీమంతి అనవలసి వచ్చినా, పాముల దగ్గరకు వచ్చేసరికి మనం పెట్టుకునే నాగలక్ష్మి, సుబ్బన్న పేర్లు చక్కగా అమిరాయి అంటారు కథారమణీయం ముందుమాటలో సంపాదకుడు ఎమ్బీఎస్ ప్రసాద్. ఋణగ్రహీతల పేర్లు ఋణదత్తుడు, ఋణాన్నభుక్కు, ఋణకేతువు, ఋణవ్రతుడు, అప్పారావు, అప్పలస్వామి, అప్పన్న, చేబదుళ్ల చెంచయ్య మొదలుగా పెట్టడం కూడా హాస్యస్ఫోరకంగా అమరింది.
#అప్పు ఆశీర్వాదాలు, అప్పు తిట్లు అప్పుల వర్ణనలు వంటి విచిత్ర వాక్య ప్రయోగాల ద్వారా కూడా రమణ హాస్యాన్ని సాధించారు. అప్పు ఆశీర్వాదాలు అడగ్గానే అప్పు దొరకా, వీడికి అడ్డమైనవాడూ అప్పులివ్వా అప్పు తిట్లు నీ దగ్గర అడ్డమైనవాడు అప్పు చేసి ఎగ్గొట్టా, అవసరం తీరాకా అప్పు దొరకా, అప్పు ఉపమానాలు అప్పు చేసినవాడి డబ్బులా హడావుడిగా ఖర్చయిపోయింది., ఐపీ పెడుతున్నవాడికి ఆ క్రితం రోజే ఆస్తిమీద అరవైవేలు అప్పిచ్చినవాణ్ని చూసి తోటివాళ్ళు నవ్వినట్టు., చాలాకాలం తరువాత రావలసిన డబ్బు చేతికి రాగానే అప్పులవాళ్ల మొహాన విసిరికొట్టేవాడిలాగా, దూకుడుగా, అప్పులు తీర్చేసినవాడి మనసులా లోకం ప్రశాంతంగా ఉంది కథల్లో వస్తాయి.
#చీమ తప్పుడు కథ చెప్పడం, ఆర్నెల్లు సహవాసం చేస్తే వారు వీరవుతారన్న సామెత సార్థకం చేస్తూ చివర్లో పాములు చీమలుగా, చీమలు పాములుగా మారిపోవడం, అప్పారావు అప్పులు పొందే టెక్నిక్కులు, చివర్లో గుర్నాధం తండ్రి వద్దే సుబ్బారావుగా అప్పు పొంది అదే అప్పును తీర్చడానికి కొడుకు వద్ద అప్పు తీసుకోవడం, ఊరికే ఇచ్చినా తప్పులేదన్నారుగా అంటూ ఇంకో ఐదొందలు తీస్కోవడం వంటి సంఘటనలు హాస్యాన్ని పండిస్తాయి.
#ఋణానందలహరి చూస్తే ఇతర విషయాలతోబాటు తెలుగు భాషపై రమణకున్న పట్టు ఎటువంటిదో, భాషతో ఆయన చేసిన ప్రయోగాలు ఎటువంటివో, మాటలతో ఆయన ఎలా ఆటలాడుకున్నాడో తెలుస్తుంది అంటారు విమర్శకుడు, రచయిత ఎమ్బీఎస్ ప్రసాద్. అప్పుకు సాంకేతిక పదజాలాన్ని సృష్టించారు రమణ ఈ కథల్లో. తెలిసిన పదాలనే అక్షరం మార్చి దాఋణం, అఋణకిరణుడు, కఋణ వంటి పదాలు సృష్టించారు. తిరుగుటపా-మరుగుటపా, ధనస్వామి-ఇంధనస్వామి, బిర్లా-షిర్లా వంటి జంటపదాలు వేశారు.
ఇతర జంతుజాలానికి భాష తయారు చేశారు. ఉదాహరణకు:
కాకిభాష: కావులించి, కావుకేకలు, రెక్కలో బాణం గుచ్చుకున్నట్టు, కావురుబావురుమంటూ ఏడవడం, రెక్కాడితే గాని డొక్కాడనివాళ్లం, కాకమ్మ కబుర్లు
పాముభాష: తుసాబుసామంటూ, కడుపారా గాలి భోంచేసి బుస్సున తేన్చడం (పాములను సంస్కృత సాహిత్యంలో గాలి భోంచేసే జీవులుగా అభివర్ణించారు), గాలిపుట్టలు కట్టడం
చీమభాష: చిమచిమ నవ్వు, పుట్టతీసి, పుట్టమునగడం (కొంపదీసి, కొంపమునిగింది అని మనుషులు అన్నట్టుగా).
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
Comments
Post a Comment