❤️💥🚩పెద్దన గారి గండ పెండెరం పద్యం నుకు అర్ధం .🚩💥❤️







    ❤️💥🚩పెద్దన గారి గండ పెండెరం పద్యం నుకు                                                           అర్ధం .🚩💥❤️


🚩🚩

ఒక రోజు కృష్ణ దేవరాయల వారు ఒక బంగరు పళ్ళెం తెచ్చి దానిలో గండ పెండేరాన్ని ఉంచి ఆస్థాన కవులను జూచి “మీలో ఎవరైనా సంస్కృతాంధ్ర భాషలలో సమానంగా కవిత్వం చెప్పిన యెడల వారికి ఈ గండ పెండేరం యిస్తాను” అని చెప్పారు. ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు కృష్ణ దేవరాయల వారు


ఉ: ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగా


నొద్దిక నాకోసంగు మనియొక్కరు గోరగలేరు లేరొకో


అనే పద్యం ప్రారంభించారు. అల్లసాని వారు లేచి ఆ పద్యాన్ని


“పెద్దన బోలుపండితులు పృథ్విని లేరని నీవెఱుంగవే


పెద్దన కీ దలంచినను పేర్మిని నాకిడు కృష్ణ రాణృపా”


అని పూరించారు. ఆ పైన ముప్పది పాదాల ఉత్పలమాలికను సగం పాదాలు అచ్చ తెన్గులో సగం సంస్కృతంలో ఆశువుగా చెప్పారు.

💥💥💥💥💥

🚩ఆ పద్యం దాని అర్ధం .!!


పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా


కైతలు ? జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్ (1-2)


అలోచనామృత ధారా వాహినులైన ఉత్కృష్ట కవితా విలాసములు కేవలము పై పై చూపుల నలరించు క్రొంబూతల శబ్ద వికసనములతో … లేత పిందెల (కసుగాయ ) వంటి సామాన్య భావములతో ..సహృదయ హృద్యంగమములు కాలేవు కదా ! అవి శ్రుతి పక్వములైన లలిత కోమల కాంతా వదావళులు , ఉదాత్త గాంభీర్యముల మేలు కలయికలై పఠితల మదిలో ప్రవేశించి హృదయమునకు హత్తుకొనవలెను . ఆ పద లాలిత్యము భావౌన్నత్యము తో మేళవించి వినువారి మానసమును కమ్మని పరిమళములో ముంచెత్తవలెను .


రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలి యారజంపు ని


ద్దా తరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్ (3-4)


ఆ కవితా సౌరభములు మదిని స్పృశించుచున్నంత వరకూ ..తన డెందమును కొల్లగొనిన ప్రేయసి అమందానంద సందోహ భరితమైన చేతల లీలావిలాసములవలె మదన మాధుర్యములై రేయింబవలు మరపురాని అనుభూతిని లోలోన కలిగించవలెను


బాఁతిగఁ బై కొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ


కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్ (5-6)


ఆపరాని ఆనంద పారవశ్యమున ఎగసి పలికెడి మిక్కిలి మక్కువగల యవ్వన వతి కలగీతికల వలె వలపు వెల్లువలై పల్లవాపవలెను . ఆలాపనలు ఆలకించగనే ..ఉల్లము రంజిల్లి ..జిలిబిలి యూహలు తీయని కోర్కెల రూపును సంతరించుకోవలెను .


జేతికొలందిఁ గౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మే


ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిచూచినన్ (7-8)


ఆ కైతలను మనసుకు పట్టించగా మదినిలోగొని ప్రియమార బిగి కౌగిలి జేర్చిన ముగ్ద మనోహరి సన్నని పై యెదలోనున్న అందీ అందని స్నిగ్ద సుకుమారపు చనుగవ వలె స్పర్శా సుఖానుభూతినందించి ఉద్వేగమును పెంచవలెను .


డాతొడనున్న మిన్నులమిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ


వాతెఱదొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్ (9-10)


తన రూప లావణ్య విభవాతిశయములచే ..విభ్రమము కలిగించి వామాంకమునధిష్టించిన మోహనాంగిని మునిపంట నొక్కినప్పుడు ..దొండపండు వంటి పెదవులనుండి చిప్పిల్లు అధరామృత ధార వలె కవితా రసము లోనికి పరవళ్ళు దొక్కవలెను .


గాతలఁ దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు


న్మేతెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం


బూఁతల నున్న కాయ సరిపోఁడిమి కిన్నెర మెట్లబంతి సం (11-13)


మనసు దరిజేర పరమేష్టి ప్రియురాలి స్వచ్చమైన దేహకాంతి కి సమమై సంభ్రమము కలిగించి ఉధృద్ధ్యాతిశయముచే .. పిడికిలినింతగా పైకి పొంగిన పయోధరముల రాపిడి చే హస్తమందు కలిగిన మృదువైన కాయ వలె శోభించవలెను .


గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళపంతుకా


సాతత తానతానలపసన్ దివుటాడెడు గోటమీటు బల్


మ్రోతలునుంబలెన్ హరువు మొల్లముగావలె నచ్చతెన్గు లీ (14-16)


కవితలు మదిని తడుముచుండగా ..కన్నడ , గౌళ రాగమున స్వర సప్తక యుతమై ఎడతెగని రాగ ప్రస్తార ప్రాచుర్యము సన్నని మెట్ల వరుసపై కిన్నెర వీణియ గొట మీటుంచుండగా మృదువుగా నర్తించుచుండగా వెలువడు సవ్వడులు నవయవ్వనమున వికసించు శృంగార చేష్టలు విలాస సాంద్రతలై అచ్చ తెనుగు భాష కైతలీ రీతిగా మనోజ్ఞముగా నుండవలెను


ఇక అమర భాష యైన సంస్కృతము లో కవిత్వము గురించిన విశేషము చెప్పెద !


రీతిగ సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ


టీ తపనీయగర్భనికటీ భవ దాననపర్వసాహితీ


భౌతిక నాటకప్రకర భారత భారత సమ్మతప్రభా (17-19)


శారదా దేవి బంగారు రంగారు గర్భ సంభవమై ..పరా , పశ్యంతి , మధ్యమ , వైఖరి కలిత వాగ్వైభవ రూపమై శబ్దార్ధ జ్ఞాన సంపన్న మైన వాఙ్మయముతో ముత్యాల లావణ్య శ్రేష్టలలితములైన భరతముని నాట్య శాస్త్ర సమ్మతమైన దశవిధ రూపకములను అనర్ఘమైన పంచ కావ్యములను దీపించుచూ …


శీతనగాత్మజా గిరిశశేఖర శీత మయూఖరేఖికా


పాతసుధాప్రపూర్ణ బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ (20-21)


చలిమల కూతురైన పార్వతీ దేవి సిగబాటియైన చంద్ర కళలనుండి నిరంతరము జాల్వారు రసామృత వృష్టి పుష్టితో ..నానా విధములైన ఘమం ఘమ ఘం ఘమల ప్రౌఢిమ నుండి వెలార్చిన ….


జాతక తాళయుగ్మ లయసంగతి చుంచు విపంచికా మృదం


గాతత తేహితత్తహిత హాధితధంధణుధాణుధింధిమి


వ్రాతనయానుకూల పదవారకుహూద్వహ హారికింకిణీ (22-24)


లయ తాళముల మేలికూర్పును చేకూర్చుకొన్నవై వీణా నిక్వణము , మృదంగ స్వనముల సమాగమములౌ తేహి , తద్తహి ,తహాధిత , ధాణు ధింధిమల సమూహముల కనుకూలములైన కోకిలల కలస్వనములతో .. గమకితములైన మనోహరములౌ చిరుమువ్వల సవ్వడులు కలిగిన ….


నూతనఘల్ఘలా చరణనూపుర ఝూళఝుళీ మరందసం


ఘాతవియద్ధునీ చకచక ద్వికచోత్పలసారసంగ్రహా (25-26)


నవీనమైన గలగలలు కల్గిన కాలి అందెల రవళులనెడు మరంద మాధుర్యమువలె చక్కగా శొభించిన నీలోత్పలముల కుసుమరాగ పరాగ ధూసరములై ..


యాత కుమారగంధవహహారి సుగంధ విలాసయుక్తమై


చేతము చల్లఁజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర (27-28)


పెంపెక్కిన మలయ మారుతపు పిల్ల తెమ్మెరలవలె మనోహర సువాసనా విలాసములీను మదిని అనుపమానమైన ఆనందమును రేకెత్తించవలెను


ద్యోతకగోస్తనీఫలమధుద్రవ గోఘృతపాయసప్రసా


రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారె సారెకున్ । (29-30)


తీయని సరసమొలికించి హృదయమును రాగ రంజితము జేయు ద్రాక్షా రసము , తేనె , గోఘృతము పాయసములతో .. మేళవించిన విశిష్టమైన అతిరసమను పదార్ధము వలె ఆనందామృతము వెల్లి విరియగా మాటి మాటికీ రసానుభూతి తో ముంచెత్తుతూ పఠితలను మురిపించి మరపించవలెను .

🚩🚩🚩🚩🚩🚩🚩🚩


Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!