రుక్మిణీ కళ్యాణం.🚩 రుక్మిణి కి శుభ సూచకములు - .కోన సాగింపు- 7- (పోతనామాత్యుడు )
రుక్మిణీ కళ్యాణం.🚩
రుక్మిణి కి శుభ సూచకములు - .కోన సాగింపు- 7-
(పోతనామాత్యుడు )
💥
"పోఁ"డను "బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి; వాసుదేవుఁడున్
రాఁ" డను; "నింకఁ బోయి హరి రమ్మని చీరెడి యిష్టబంధుడున్
లేఁ" డను; "రుక్మికిం దగవు లేదిటఁ జైద్యున కిత్తు నంచు ను
న్నాఁ" డను; "గౌరి కీశ్వరికి నావలనం గృపలేదు నే" డనున్.
👉👉👉
(“మాధవుని మథురకి బ్రాహ్మణుడు అసలు వెళ్ళే వెళ్ళి ఉండడు. వాసుదేవుడు ఇంక రాడు. పిలుచుకొచ్చే ప్రియ బాంధవుడు ఇంకొకడు లేడు. అన్న రుక్మికి అడ్డేం లేదు. శశిపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు. ఇవాళ పార్వతీదేవికి నామీద దయలేదు కాబోలు” అని రకరకాలుగా మధనపడుతోంది.)
💥
"చెప్పదు తల్లికిం దలఁపు చిక్కు; దిశల్ దరహాస చంద్రికల్
గప్పదు; వక్త్రతామరసగంధ సమాగత భృంగసంఘమున్
రొప్పదు; నిద్ర గైకొన; దురోజ పరస్పర సక్త హారముల్
విప్పదు; కృష్ణమార్గగత వీక్షణపంక్తులు ద్రిప్ప దెప్పుడున్.
👉👉👉
(రుక్మిణీ దేవి, ముకుందుని రాకకై ఆతృతగా ఎదురు చూస్తూ అటునుండి చూపులు తిప్పడం లేదు. తన మనసు లోని వేదనలు తల్లికి కూడ చెప్పటం లేదు. చిరునవ్వులు చిందించటం లేదు. ముఖపద్మానికి మూగిన తుమ్మెదలని తోలటం లేదు. వక్షస్థలం మీది గొలుసుల చిక్కులను విడదీయటం లేదు).
💥
"తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు; కొప్పు చక్కఁగా
ముడువదు; నెచ్చలిం గదిసి ముచ్చటకుం జన; దన్న మేమియుం
గుడువదు; నీరముం గొనదు; కూరిమి కీరముఁ జేరి పద్యముం
నొడువదు; వల్లకీగుణవినోదము చేయదు; డాయ దన్యులన్.
👉👉👉
(తనను తీసుకెళ్ళటానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడో లేదో అని మధనపడుతున్న రుక్మిణీదేవి, కన్నీరు తుడుచుకోటం లేదు. జుట్టు సరిగా ముడవటం లేదు. నెచ్చలులతో ముచ్చటలు చెప్పటం లేదు. అన్నపానీయాలు తీసుకోవటం లేదు. ఇష్టమైన చిలుకకి పద్యాలు చెప్పటం లేదు. వీణ వాయించటం లేదు. ఎవ్వరి దగ్గరకు పోటం లేదు. )
👉👉👉
రాక్షసం...పైశాచికం
రుక్మిణి ఇంత గాఢంగా కృష్ణుని ప్రేమిస్తోంది కనుకనే తనను తీసుకెళ్ళి
రాక్షస వివాహం చేసుకో మని సందేశం పంపించింది.
అష్టవిధ వివాహాలలో రాక్షసం ఒకటి.
దీనిలో ఉన్న రాక్షసం కన్య పెద్దల అంగీకారంతో సంబంధంలేకుండా,
అంగీకరించిన కన్యను ఎత్తుకొచ్చి వివాహమాడుట వరకు.
కన్య అంగీకారంతో కూడ సంబంధలేకుండా చేసేది.. పైశాచికం
💥
"మృగనాభి యలఁదదు మృగరాజమధ్యమ;
జలకము లాడదు జలజగంధి;
ముకురంబు చూడదు ముకురసన్నిభముఖి;
పువ్వులు దుఱుమదు పువ్వుఁబోఁడి;
వనకేళిఁ గోరదు వనజాతలోచన;
హంసంబుఁ బెంపదు హంసగమన;
లతలఁ బోషింపదు లతికా లలిత దేహ;
తొడవులు తొడువదు తొడవు తొడవు
.
తిలకమిడదు నుదుటఁ దిలకినీతిలకంబు
గమలగృహముఁ జొరదు కమలహస్త
గారవించి తన్నుఁ గరుణఁ గైకొన వన
మాలి రాఁడు తగవుమాలి యనుచు.
👉👉👉
(అన్యాయంగా కృష్ణుడు తనను ప్రేమతో కరుణించ డానికి రావటం లేదు అన్న తలపుల పరధ్యాన్నంలో పడి, ఆ సింహపు నడుము చిన్నది కస్తూరి రాసుకోడం లేదట. పద్మగంధం లాంటి మేని సువాసనలు గల పద్మగంధి జలకా లాడటం లేదట. అద్దం లాంటి మోముగల సుందరి అద్దం చూట్టం లేదట. పువ్వులాంటి సుకుమారి పువ్వులే ముడవటం లేదట. పద్మాల్లాంటి కళ్ళున్న పద్మాక్షి జలక్రీడకి వెళ్ళటం లేదట. హంస నడకల చిన్నది హంసలను చూట్టం లేదట. లత లాంటి మనోఙ్ఞమైన కోమలి లతలని చూట్టం లేదుట. అలంకారాలకే అలంకారమైన అందగత్తె అలంకారాలు చేసుకోవటం లేదుట. చక్కటిచుక్క లాంటి వనితాశిరోమణి బొట్టు పెట్టుకోటం లేదట. కమలాల లాంటి చేతులున్న సుందరి సరోవరాలలోకి దిగటం లేదట.)
ఇంతేకాకుండా.
💥
మలఁగున్ మెల్లని గాలికిం; బటునటన్మత్త ద్విరేఫాలికిం
దలఁగుం; గోయల మ్రోఁతకై యలఁగు; నుద్యత్కీరసంభాషలం
గలఁగున్; వెన్నెలఁవేడిమిం నలఁగు; మాకందాంకురచ్ఛాయకుం
దొలఁగుం; గొమ్మ మనోభవానలశిఖా దోధూయ మానాంగియై.
👉👉👉
(మన్మథతాపాగ్నిలో వేగిపోతున్న మగువ పిల్లగాలికి అలసి పోతుంది. దోగాడే తుమ్మెదలకి తొలగిపోతుంది. కోయిల కూసినా చిరాకు పడుతుంది. చక్కటి చిలక పలుకులకి ఉలికి పడుతుంది. వెన్నెల వేడికి వేగిపోతుంది. మామిడి చెట్టు నీడకి తప్పుకుంటుంది.)
ఇలా కృష్ణుని రాకకి ఎదురు చూస్తూ సర్వం మరచి మన్మథతాపంతో వేగిపోతున్న సుందరి రుక్మిణికి శుభ సూచకంగా ఎడంకన్ను, ఎడంభుజం, ఎడంకాలు అదిరాయి; అంతలోనే అగ్నిద్యోతనుడు కృష్ణుడు పంపగా వచ్చేడు;
👉👉👉
అతని ముఖకవళికలు చూసి మిక్కలి ఉత్సుకతతో రుక్మిణి చిరునవ్వుతో ఎదు రెళ్ళింది; అప్పుడా బ్రహ్మణుడు ఇలా అన్నాడు
👉👉👉.👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉👉
Comments
Post a Comment