💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

 


🌹
.ఒకపరి జగముల వెలినిడి, యొకపరి లొపలికిఁ గొనుచు నుభయుముఁ దానై
సకలార్థ సాక్షియగు న, య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్
లోకంబులు లోకేశులు, లోకస్థులుఁ దెగినతుది నలోకంబగు పెం
జీఁకటి కవ్వల నెవ్వఁడు, నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్
🌹🌹
కరి దిగుచు మకరి సరసికి
కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్
కరికి మకరి మకరికి కరి
భరమనుచును నతల కుతల భటులరుదు పడన్ !!
.🌹🌹
కలడందురు దీనుల యెడ
కలడందురు భక్త యోగి గణముల పాలం
గలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో !!
.
.🌹🌹
లోకంబులు లోకేశులు
లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వడు
ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !!
.🌹🌹
ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై?
ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం
బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా
డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !!
..🌹🌹
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !!
.🌹🌹
అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభి యై !!
.🌹🌹
సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు గజప్రాణా వనోత్సాహి యై !!
.
.🌹🌹
అడిగెద నని కడు వడి జను
అడిగిన తన మగుడ నుడువడని నెడయుడుగున్
వెడ వెడ జిడి ముడి తడ బడ
నడుగిడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్
.🌹🌹.🌹🌹.🌹🌹.🌹🌹.🌹🌹.🌹🌹.🌹🌹
🚩పోతనగారి పద్యం... సి.నారాయణ రెడ్డిగారి వ్యాఖ్యానం:!
.
♦️"ఎవ్వనిచే జనించు జగం.
ఎవ్వనిచే జనించు జగ, మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు బరమేశ్వరుడెవ్వడు, మూలకారణం
బెవ్వ, డనాదిమధ్యలయు డెవ్వడు, సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్."
.
గజరాజు నోటి నుండి పోతన్న పలికించిన పద్యం.
సి.నారాయణ రెడ్డిగారి వ్యాఖ్యానం:
.
♦️సర్వేశ్వరుని మూలతత్త్వం ఈ పద్యంలో ఎన్నో దళాలతో విప్పారింది. ఇందులోని "ఎవ్వడు" అవ్యక్తుడు.
ఆ అవ్యక్తరూపుణ్ణి వ్యక్తపరచటానికి 'ఎవ్వడు' అనే మాట
ఎన్నో విభక్తులతో రూపుదిద్దుకుంది. అదే ఈ పద్యంలో విశిష్టత.
.
భావం
♦️ఎవ్వని చేత ఈ జగమంతా సృష్టింపబడినదో, ఎవ్వని లో ఈ జగమంతా లీనమై వుందో, (ఎవ్వనియందు డిందు)ఎవ్వని చేత నాశనం చేయబడుతోందో, ఈ సృష్టికి మూలకారణం ఎవ్వడో, మొదలు, చివర, మధ్య అంతా తానే అయి వున్నవాడు ఎవడో, ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు కోరుచున్నాను.
.
♦️కలడందురు దీనులయెడ
గలడందురు పరమయోగి గణముల పాలం
గల డందు రన్ని దిశలను
గలడు కలండనెడు వాడు గలడో లేడో
.
♦️మడుగు లో జలకాలాడుతూ, మకరికి చిక్కుతాడు గజేంద్రుడు. హోరాహోరా గా సాగుతున్న ఇరువురి పోరాటంలో, గజరాజు అలసిపోతాడు, ఓటమికి దగ్గరవుతున్నప్పుడు జ్ఞానోదయం అవుతుంది. హరిని ప్రార్థించటం మొదలుపెడతాడు.
.
సి.నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం
గజేంద్రుడు ప్రస్తుతం ఆర్తుడు. ఆర్తిలో అచ్చమైన సత్యమూర్తి పొరలు పొరలుగా కనిపిస్తుంది. భగవంతుడు అంతటా ఉన్నాడని అంటారు. అలా అనగా ఇతడు విన్నాడు. త్రికరణ శుద్ధిగా నమ్మి వున్నాడు. అయినా అప్పటి జంజాటంలో జీవి బుద్ధిని సంశయం కమ్ముకుంది. 'కలడు కలండనెడి వాడు' కలడో లేడో అని గుంజుకున్నాడు ఆ ముడులు విడని సంశయాత్ముడు.
ఈ సంశయాత్ముడు ఇలా సతమతమవుతూ వుంటే, ఆ నిశ్చయాత్ముడు ప్రహ్లాదుడు సర్వేశ్వరుని విషయంలో 'సందేహము వలదని' చెప్పాడు. ఇదీ ఈ ఇద్దరి మధ్యలో ఉన్న తేడా.
ఒక్క గజేంద్రుడే కాదు, ఈ లోకంలోని కోటానుకోట్ల జీవులు అప్పుడప్పుడూ ఈ పెనుగులాటతోనే సతమతమవుతున్నారు - పరమాత్ముని అస్తిత్త్వాన్ని నిరాకరించలేక, నిర్ణయించలేక.
పరమగంభీరమైన ఈ బ్రహ్మ జిజ్ఞాసను చిన్న చిన్న మాటలోలో ఎత్తిచూపి, పామరులకు కూడా పరమతత్త్వాన్ని అందజేసినాడు పోతన్న.
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩ఉషా పరిణయం.🚩🚩